Karnataka: ఆ మాటలే చెబుతున్నాయి అతను ఎలాంటివాడో!: రేవణ్ణ వ్యాఖ్యలకు బదులిచ్చిన సుమలత

  • బాధ కలగలేదు
  • మరింత దృఢంగా తయారయ్యాను
  • దీటుగా సమాధానం చెప్పిన నటి
దివంగత అంబరీష్ భార్య, ప్రముఖ దక్షిణాది నటి సుమలత తనపై కర్ణాటక మంత్రి రేవణ్ణ చేసిన వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. ఆయన మాట్లాడిన మాటలకు తనకు ఎక్కడా బాధ కలగలేదని, ఆ మాటలు తనను మానసికంగా మరింత దృఢంగా మలిచాయని అన్నారు. అంతకుముందు, మంత్రి రేవణ్ణ మాట్లాడుతూ, భర్త పోయి కొన్నిరోజులైనా కాకముందే రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు అంటూ సుమలతపై వ్యాఖ్యానించారు. భర్త పోయిన వాళ్లు బాధపడాలి కానీ, ఇలా పావులు కదుపుతూ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉబలాటపడడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అనిపిస్తుందని అన్నారు.

 దీనిపై సుమలత స్పందిస్తూ, తన భర్త విషయం మాట్లాడి వ్యాఖ్యలు చేసినవాళ్లు ఎలాంటివారో వారి మాటలే చెబుతున్నాయని, మహిళలను రాజకీయాల్లో ఎంత చిన్నచూపు చూస్తారో చెప్పడానికి రేవణ్ణ మాటలే నిదర్శనం అని అన్నారు. ఇవి తనను ఉద్దేశించిన మాటలుగా భావించడంలేదని, మహిళలందరినీ ఉద్దేశించిన వ్యాఖ్యలుగానే భావిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే సుమలతకు బహిరంగ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
Karnataka

More Telugu News