pulwama: కశ్మీర్లో ఎన్ కౌంటర్: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదాసిర్‌ అహ్మద్‌ఖాన్‌ హతం

  • పింగ్లీష్‌ ప్రాంతంలో మట్టుపెట్టిన భద్రతా బలగాలు
  • పేలుడు పదార్థాలు, వాహనాన్ని సమకూర్చింది ఇతనే
  • 2017లో జైషే ఉగ్ర ముఠాలో చేరాడు
జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో మానవ బాంబు రూపంలో దాడికి పాల్పడి 43 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమైన సూత్రధారి ముదాసిర్‌ అహ్మద్‌ఖాన్‌ను భద్రతా బలగాలు ఆదివారం హతం చేశాయి. ఈ ఘటనలో మానవబాంబ్‌గా మారిన వ్యక్తికి వాహనంతోపాటు పేలుడు పదార్థాలు సరఫరా చేసింది ఇతనే.

త్రాల్‌లోని పింగ్లిష్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చి ఆపరేషన్‌ నిర్వహించాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఇంట్లో దాక్కున్న ముష్కరులు బలగాలపైకి కాల్పులు జరపడంతో వీరు కూడా ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతంకాగా, వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి.

హతుల్లో ఒకరిని ముదాసిర్‌ అహ్మద్‌ఖాన్‌గా పోలీసులు భావిస్తున్నారు. త్రాల్‌లోని మిర్‌మొహల్లా ప్రాంతానికి చెందిన వాడు అహ్మద్‌. ఉగ్రదాడిలో పాల్గొన్న ఆత్మాహుతి దళసభ్యుడు ఆదిల్‌ అహ్మద్‌దార్‌ దాడికి ముందు పలుమార్లు అహ్మద్‌ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేల్చారు.
pulwama
encounter
three dead

More Telugu News