Telangana: ఓవర్ టేక్ చేయబోయి ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు అక్కడికక్కడే మృతి!

  • తెలంగాణలోని నల్గొండలో ఘటన
  • క్షతగాత్రులు కామినేని ఆసుపత్రికి తరలింపు
  • కేసు నమోదుచేసిన పోలీసులు
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద జాతీయ రహదారిపై వెళుతున్న ట్యాంకర్ ను ఓ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 15 మందికి గాయాలు అయ్యాయి.

ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డవారి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

లారీ ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Telangana
Nalgonda District
Road Accident

More Telugu News