అనుమానంతో సొంత భార్య పైనే నిఘా.. చివరికి దొరికిపోయాడిలా..!
- భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త
- ఆమెపై నిఘా పెట్టాలంటూ డిటెక్టివ్ సంస్థతో ఒప్పందం
- విచారణలో వెలుగు చూసిన అసలు నిజం
కొన్ని రోజులుగా ముగ్గురు వ్యక్తులు తానెక్కడికి వెళ్లినా కనిపిస్తుండడంతో ఆమెలో అనుమానం మొదలైంది. ఆఫీస్, బజార్, షాపింగ్ మాల్, హోటల్.. ఇలా తను వెళ్లిన ప్రతి చోట వారు ముగ్గురూ కనిపిస్తుండడంతో భయపడింది. ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదని, వారు తనను వెంటాడుతున్నారని ఆమెకు అర్థం అయింది. వారి సంగతేంటో తేల్చాలని నిర్ణయించుకుంది.
ఈ విషయాన్ని తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌కు రావాలని కోరింది. ఆ వెంటనే ఆమె కూడా బయలుదేరింది. ఆ ముగ్గురు తనను అనుసరిస్తుండడాన్ని ఆమె గమనించింది. ఆమె ఖాన్ మార్కెట్‌కు చేరుకునేలోపే ఆమె సోదరుడు కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ షాప్‌లోకి వెళ్లారు. ఆ డిటెక్టివ్లు ముగ్గురు అక్కడికి కూడా రావడంతో వారు తననే ఫాలో అవుతున్నారని నిర్ధారించుకుంది. ఇక లాభం లేదనుకుని అక్కడి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు చెప్పిన విషయాలు విని మహిళతోపాటు పోలీసులు కూడా షాక్ తిన్నారు. తాము ఓ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థ ఉద్యోగులమని చెప్పారు. మహిళ భర్త కోరడంతోనే ఆమెపై నిఘా పెట్టామని చెప్పడంతో విస్తుపోయారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు మహిళ భర్త అయిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.