Andhra Pradesh: కన్నా, సోము వీర్రాజు మాట్లాడే గలీజు భాషకు మోదీ సంబరపడిపోతున్నారు!: మంత్రి నక్కా ఆనంద్ బాబు

  • చంద్రబాబు అంటే ప్రధానికి భయం పట్టుకుంది
  • ఉపాధి హామీ నిధులు నిలిపేసి కక్ష సాధిస్తున్నారు
  • ఏపీ ప్రభుత్వంపై మోదీ అబద్ధాలు సరికాదు
ప్రధాని నరేంద్ర మోదీ అంతటి దగుల్బాజీ, దివాళాకోరు నేతను తాను ఇంతవరకూ చూడలేదని ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఓ ప్రధానికి ఉండాల్సిన హుందాతనం కూడా లేకుండా ఆయన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు మాట్లాడుతున్న గలీజు భాషకు మోదీ సంబరపడిపోతున్నారని దుయ్యబట్టారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్పడం సరికాదని నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఇది 5 కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమేనని అన్నారు. తన ఆస్తులను కాపాడుకోవడానికే కన్నా బీజేపీలో చేరారని మంత్రి ఆరోపించారు. కన్నా, పురంధేశ్వరి.. వీరిద్దరూ తాత్కాలిక బీజేపీ నేతలని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే మోదీకి భయమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మోదీ నోటిని అదుపులో పెట్టుకోకపోతే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను కాపాడేందుకే ఆగమేఘాల మీద హైకోర్టును కేంద్రం విభజించిందని నక్కా ఆరోపించారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే జగన్ తో కలిసి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఏపీలో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో నిధులను ఆపేసి ఏపీపై కేంద్రం కక్ష సాధిస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
BJP
Telugudesam
Narendra Modi
Jagan
YSRCP
Chandrababu
kanna
somu veeraju
criticise

More Telugu News