పార్లమెంటు ఎన్నికలపై టీఆర్ఎస్ నజర్.. తొలి అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!
- టీఆర్ఎస్ కు ప్రజలు 47 శాతం ఓట్లు ఇచ్చారు
- రైతు భీమా, రైతు బంధు అమలుకు కేంద్రం యోచిస్తోంది
- సిరిసిల్ల సభలో మాట్లాడిన కేటీఆర్
కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. దేశంలోని 11 రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని అభినందించాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం కృషి చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలకు తోడు మరో రూ.15 లక్షలను నజరానాగా అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజీపడిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారని కేటీఆర్ ప్రకటించారు. ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.