YSRCP: ఈ ముగ్గురూ దేశద్రోహులు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఒకటి.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ
  • రెండు.. భారతీయ జనతా పార్టీ
  • మూడు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
దేశద్రోహులు, ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు ఈ దేశంలో ముగ్గురు ఉన్నారని, ఒకటి.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, రెండు.. భారతీయ జనతా పార్టీ, మూడు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవడానికి ఈ ముగ్గురే కారణమని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, చెన్నై-వైజాగ్ కారిడార్..ఇలా ఏ ఒక్క హామీ నెరవేరలేదని.. ఇందుకు కారణం, బీజేపీ, చంద్రబాబునాయుడేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీడీపీలు జతకట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం, ద్రోహం చేశాయని విమర్శించారు.

వైసీపీ- బీజేపీ ఒకటేనని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ, ప్రతి రాజకీయపార్టీతో కాపురం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడని విమర్శించారు. పదిహేను రాజకీయపార్టీలతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని, ఆయన తొడుక్కున్న ఒక్కో ముసుగు తీస్తే ఒక్కో రాజకీయ పార్టీ కనపడుతుందని విమర్శించారు.

వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ తాము జతకట్టేది లేదని తమ అధినేత జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని అన్నారు. ఏ పార్టీ అయితే కేంద్రంలో అధికారంలోకొచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందో, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తారో, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిన తర్వాతే ఆ పార్టీని బలపరిచే విషయాన్ని పరిశీలిస్తామని జగన్ చెప్పడాన్ని ప్రస్తావించారు. 
YSRCP
mp
vijayasaireddy
Chandrababu
Sonia Gandhi
bjp
Andhra Pradesh
cuddapah

More Telugu News