Nara Lokesh: ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ హబ్ గా మారుతోందని చెప్పా: నారా లోకేశ్

  • సింగపూర్ పర్యటనలో లోకేశ్ 
  • ఎలక్ట్రానిక్స్ పార్క్స్ నిర్మాణానికి సహకరించమని కోరా
  • అమరావతి పార్ట్ నర్ షిప్ ఆఫీస్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ ప్రతినిధులను కలిశా
సింగపూర్ లో పర్యటిస్తున్న ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. రెండో రోజు పర్యటన వివరాలను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచారు. ‘సింగపూర్ పర్యటనలో రెండవరోజు.. అమరావతి పార్ట్ నర్ షిప్ ఆఫీస్ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ ప్రైజ్ ప్రతినిధులతో సమావేశమయ్యాను. కేవలం నాలుగేళ్లలో అనేక పాలసీలు, రాయితీలు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఏపీ హబ్ గా మారుతోందని వారికి వివరించాను.

దేశంలో తయారయ్యే 30 శాతం ఫోన్లు ఏపీలోనే తయారవుతున్నాయనీ, 200 విడిభాగాల తయారీ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ఫాక్స్ కాన్, సెల్ కాన్, కార్బన్, డిక్షన్ సంస్థలు రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, టీసీఎల్ కు ఇటీవలే భూమి పూజ నిర్వహించామని తెలిపాను. త్వరలో రిలయన్స్ జియో, ఓల్టాస్ కంపెనీల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నామని వివరించాను. ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి క్లస్టర్ మోడల్ అమలు చేస్తున్నామని, ఎలక్ట్రానిక్స్ పార్క్స్ నిర్మాణం కోసం సహకరించవలసిందిగా ప్రతినిధులను కోరాను’ అని పేర్కొన్నారు.  

ఈ సందర్భగా అమరావతి పార్ట్ నర్ షిప్ ఆఫీసులో దిగిన ఓ సెల్ఫీని నారా లోకేష్ పోస్ట్ చేశారు. తన ఫోన్ లో ఈ చక్కటి మెమొరీని బంధించానని, అమరావతి గురించి ప్రత్యేకంగా ప్రచారం చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం నిర్వహణలో అమరావతి పార్ట్ నర్ షిప్ కార్యాలయం పనిచేస్తోందని పేర్కొన్నారు.
Nara Lokesh

More Telugu News