బీటెక్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్..రోడ్డుపై వెళుతుండగా ఎత్తుకెళ్లిన దుండగులు!
- ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణం
- కోచింగ్ కు వెళ్లివస్తున్న యువతి
- లైంగికదాడికి పాల్పడ్డ నలుగురు యువకులు
ఆగ్రాలో బీటెక్ చదువుతున్న బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో కోచింగ్ కు వెళ్లిన ఆమె, తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్ పై అటకాయించారు. అనంతరం ఆమెను బలవంతంగా యమునా నది తీరంలో ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా బలమైన వస్తువుతో యువతి తలపై దాడి చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
మరోవైపు తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎలాగోలా ఇంటికి చేరుకున్న యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదుచేశారు. అనంతరం యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం నలుగురు నిందితులు పరారీలో ఉన్నారనీ, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ను రంగంలోకి దించామని ఆగ్రా ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు.