Tamilnadu: మోదీని గద్దెదించాలన్న లక్ష్యంతోనే అలా చెప్పా : 'ప్రధానిగా రాహుల్‌' ప్రతిపాదనపై స్టాలిన్‌ వివరణ

  • లౌకిక వాద పార్టీలను ఏకం చేయడమే దీని ఉద్దేశం
  • మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపణ
  • మతసామర్యాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజం
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో  తాను చేసిన ‘ప్రధానిగా రాహుల్‌గాంధీ’ ప్రతిపాదనపై డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ వివరణ ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో మతసామరస్యాన్ని పాడుచేస్తున్న ప్రధాని మోదీని గద్దెదింపడమే లక్ష్యంగా చేసిన ప్రకటన అని వివరించారు. రాహుల్‌ను ప్రధానిగా ప్రతిపాదిస్తూ ప్రకటన చేయడమేకాక మిగిలిన పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని స్టాలిన్‌ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆయన కార్యకర్తలకు వివరణ ఇస్తూ లేఖ రాశారు.

మోదీని సాగనంపాల్సిన అవసరం ఉందని, ఈ పరిస్థితుల్లో లౌకిక వాద పార్టీలను ఏకం చేసే ఉద్దేశంతోనే తానీ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఉత్తరాదిలో బలమైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడడం తన ప్రకటనకు బలం చేకూరుస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశానికి మేలు జరగాలంటే రాహుల్‌ ప్రధాని కావాలని అభిప్రాయపడ్డారు. 2004లో లౌకికవాద ప్రభుత్వం ఏర్పడడంతో డీఎంకే ముఖ్యపాత్ర పోషించిందని, సోనియాగాంధీని అనేక మంది వ్యతిరేకించినా డీఎంకే మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
Tamilnadu
stalin
Rahul Gandhi
primeminister candidate

More Telugu News