Aadhar: ఆధార్ అడిగితే కోటి రూపాయల జరిమానా... కేంద్రం సంచలన నిర్ణయం!

  • ఆధార్ కోసం ఒత్తిడి చేస్తే భారీ జరిమానా
  • అడిగిన వ్యక్తికి గరిష్ఠంగా పదేళ్ల జైలు
  • సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్

ఇకపై మీరు బ్యాంకులో ఖాతా తెరవడానికి వెళ్లినా, కొత్త సిమ్ కార్డు తీసుకునేందుకు వెళ్లినా, అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు ఇవ్వాలని ఎవరైనా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఇవ్వాలని ఒత్తిడి చేసిన సంస్థపై రూ. కోటి జరిమానా విధించాలని, అలా అడిగిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేపట్టిన చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది.

కేవైసీ ఫార్మాలిటీస్ లో ఆధార్ తప్పనిసరేమీ కాదని, దాని స్థానంలో ఇతర ఏ కార్డుల జిరాక్సులైనా సమర్పించ వచ్చని, ఆధార్ మాత్రమే కావాలని అడగటం నేరమని పేర్కొంది. కేవలం కేంద్ర నిధులతో పేదలకు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం అవసరమని, మరే ఇతర సేవలకూ ఆధార్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశం తేల్చింది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వాలు కావాలంటే, తమ తమ ప్రాంతాల్లో ఆధార్ ను తప్పనిసరి చేసుకునే వెసులుబాటును కల్పించాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ఇక ఆధార్ లోని వివరాలను ట్యాంపర్ చేసినా, ఎవరికైనా విక్రయించినా మరింత కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలు రూపొందించాలని న్యాయశాఖకు సూచించింది. ఆధార్ డేటాను మిస్ యూజ్ చేస్తే రూ. 50 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలుశిక్ష విధించేలా చట్ట సవరణకు ప్రతిపాదించింది. కాగా, ఈ నిర్ణయాలు పార్లమెంట్ ఆమోదం అనంతరం అమలు కానున్నాయి.

More Telugu News