Vaikuntha ekadasi: తిరుమలకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు... క్యూలైన్లలోకి పంపని అధికారులతో వాగ్వాదం!

  • రేపు వైకుంఠ ఏకాదశి
  • అర్ధరాత్రి 12.05కు తెరచుకోనున్న వైకుంఠ ద్వారాలు
  • రెండు లక్షల మందికి దర్శనం కల్పిస్తామన్న టీటీడీ
తిరుమలలో రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికాగా, దేవదేవుడిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోగా, వారిని ఇంకా క్యూలైన్లలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు.

ఈ అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకోనుండగా, భక్తులకు 48 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. దాదాపు లక్ష మంది భక్తులు క్యూ కాంప్లెక్స్ లో వేచి చూసేలా ఏర్పాట్లు చేశామని, బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, మాడ వీధుల్లో మరో లక్ష మంది వరకూ వేచి చూడవచ్చని అధికారులు తెలిపారు. స్వామి దర్శనం కోసం వేచి చూసే భక్తులకు అన్న పానీయాల నిరంతర సరఫరా ఉంటుందని చెప్పారు.

కాగా, రేపు స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏకాదశి తరువాత ద్వాదశి ఘడియలు ముగిసేంత వరకూ తిరుమల గర్భగుడి చుట్టూ ఉంటే వైకుంఠ ద్వారాలు తెరచే ఉంటాయి.
Vaikuntha ekadasi
TTD
Tirumala
Tirupati

More Telugu News