తండ్రిని అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఎల్ కేజీ చిన్నారి.. కారణం విని విస్తుపోయిన పోలీసులు!
- తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఘటన
- స్వచ్ఛభారత్ స్ఫూర్తిని నింపిన బాలిక
- అభినందించిన ఉన్నతాధికారులు
జిల్లాలోని రాజపురం వినాయక వీధిలో ఓ కుటుంబానికి చెందిన హనిఫా జార(7) ఎల్ కేజీ చదువుతోంది. అయితే హనిఫా ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో ఆమె కాలకృత్యాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాలని తండ్రి ఇసానుల్లాను హనిఫా పలుమార్లు కోరింది. తండ్రితో చాలాసార్లు చెప్పి విసిగిపోయిన బాలిక..చివరికి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేసింది.
తొలుత బాలిక మాటలు విని విస్తుపోయిన పోలీస్ అధికారులు.. ఆ తర్వాత ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ విషయం చివరికి జిల్లా కలెక్టర్ రామన్‌కు తెలిసింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఆంబూరు మున్సిపాలిటి అధికారులు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి పనులను ప్రారంభించారు. కాగా, మరుగుదొడ్డి నిర్మాణానికి చొరవ చూపిన చిన్నారిని అధికారులు అభినందించారు.