Telangana: అతి విశ్వాసానికి పోతే టీఆర్ఎస్ కు పట్టిన గతే ఎవరికైనా పడుతుంది!: ఏపీ సీఎం చంద్రబాబు
- వైసీపీ, బీజేపీలు ప్రజలకు దూరమయ్యాయి
- సరైన అభ్యర్థుల ఎంపికతోనే విజయం సాధ్యం
- టీడీపీతోనే ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు లబ్ధి
అతి విశ్వాసంతో అభ్యర్థులను ఎంపిక చేయరాదనీ, అలా చేస్తే టీఆర్ఎస్ కు పట్టిన గతే ఎవరికైనా పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయకుండా విర్రవీగితే బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీలా ప్రజలకు దూరమవుతామని అన్నారు. తనకు ఉన్న పలుకుబడి, విశ్వాసం కారణంగానే దేశంలోని జాతీయస్థాయి నేతలు తనతో కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు.
దేశ ప్రయోజనాలతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తే విజయం సులభమైపోతుందని చెప్పారు. బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. టీడీపీ ప్రభుత్వం వల్లే ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా జరగడం లేదని చంద్రబాబు తెలిపారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ సభ్యత్వ నమోదును రెట్టింపు చేయాలని కార్యకర్తలకు సూచించారు.