Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ఒకే సిరీస్ తో రిజిస్ట్రేషన్.. మరో 15 రోజుల్లో అమలు!

  • జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ రద్దు
  • ఆర్టీసీకి రూ.335 కోట్ల సాయం
  • మీడియా సమావేశంలో వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ కోడ్ లను ఎత్తివేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కోడ్ తో వాహనాల రిజిస్ట్రేషన్ చేపడతామని వెల్లడించారు. 39 నంబర్ సిరీస్ తో మరో 15  రోజుల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. తాజాగా ఆర్టీసీని ఆదుకునేందుకు రూ.335 కోట్లు కేటాయించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రోజు అమరావతిలో ఆదరణ-2 పథకం అమలును మంత్రి సమీక్షించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేతివృత్తుల వారికి కోరుకున్న విధంగా అత్యాధునిక పనిముట్లు అందజేస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. లబ్ధిదారులకు ప్రస్తుతం పనిముట్లపై 20 శాతం రుణమాఫీ అందజేస్తున్నామని వెల్లడించారు. చేతివృత్తులు చేపట్టే వ్యక్తులు 10 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తే, మిగిలిన 90 శాతం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద భరిస్తుందని పేర్కొన్నారు.

ఆదరణ-2 పథకంలో భాగంగా తొలివిడతలో 2 లక్షల మందికి పనిముట్లను అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, నాలుగు లక్షల మంది ముందుకొచ్చారని వెల్లడించారు. వచ్చే నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆదరణ-2 పథకం రెండో దశను కూడా నవంబర్ లోనే ప్రారంభిస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Andhra Pradesh
achannaidu
Telugudesam
registration
15 days
aadarana
amaravati

More Telugu News