తిరుమలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం.. ఏకంగా 16,000 లడ్డూలు నొక్కేసిన వైనం!
- తనిఖీల్లో గుర్తించిన ఆలయ సిబ్బంది
- విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు
- రద్దీని అవకాశంగా మలచుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
సాధారణంగా శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి ప్రసాదంగా రెండు ఉచిత లడ్డూలను అందజేస్తారు. అయితే ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు టోకెన్లను స్కానింగ్ చేయకుండానే లడ్డూలను అందజేయాలని ఉన్నతాధికారులు కౌంటర్లలో ఉన్న సిబ్బందిని ఆదేశించారు.
దీన్ని ఆసరాగా తీసుకున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కుమ్మక్కై 16,000 లడ్డూలు నొక్కేశారు. చివరికి తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడటంతో ఆలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విజిలెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.