Pawan Kalyan: శాంతిని నెలకొల్పాల్సినప్పుడు ఒక్కోసారి కత్తి కూడా అవసరమవచ్చు: పవన్ కల్యాణ్

  • చెబితే విననప్పుడు క్రమశిక్షణలో పెట్టడమూ తెలియాలి
  • రాజకీయం వేల కోట్ల వ్యాపారం అయిపోయింది
  • జన్మభూమి కమిటీలతో గాంధీ కలలకు తూట్లు  
శాంతిని నెలకొల్పాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి కత్తి కూడా అవసరమవ్వొచ్చని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోలవరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, మంచి మాట చెబితే విననప్పుడు క్రమశిక్షణలో పెట్టడం కూడా తెలియాలని సూచించారు.

పార్టీలో చేరిన వారు ఎంత ఖర్చు పెడతారనే ఆలోచన కంటే, ప్రజలను కలుపుకుని వెళతారా? లేదా? అనే అంశానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. పార్టీలో చేరతామని అనగానే, ఎంత ఇస్తారు? ఎంత ఖర్చు చేస్తారు? అనే సంస్కృతి వేళ్లూనుకుపోయిందని, అందుకే, రాజకీయం వేల కోట్ల వ్యాపారం అయిపోయిందని విమర్శించారు. నాడు ఉభయగోదావరి జిల్లాల కరవును తీర్చేందుకు సర్ ఆర్థర్ కాటన్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారని, ఇప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలంటే ఎంత డబ్బు సంపాదించవచ్చని ఆలోచిస్తున్నారని.. పనిలో మార్పు లేదు కానీ, ఆలోచనా విధానంలోనే మార్పులు వచ్చాయని అన్నారు.

కులం గోడల మీద ఒక రాజకీయ వ్యవస్థను నడపలేం

జన్మభూమి కమిటీలను తీసుకొచ్చి మహాత్మా గాంధీ కలలకు తూట్లు పొడిచారని విమర్శించారు. కులం గోడల మీద ఒక రాజకీయ వ్యవస్థను నడపలేమని, మహనీయుడు అంబేద్కర్ ఆనాడే భవిష్యత్తును గ్రహించారని అన్నారు. రిజర్వ్ నియోజకవర్గాలు ఇవ్వకుంటే పరిస్థితి ఇంకా ఎలా ఉండేదో? అని ప్రశ్నించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నా, ఏ వర్గాన్నీ నమ్ముకోలేదని, మనుషులంతా తనకు సమానమేనని అన్నారు. కులం కట్టుబాట్లు సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగానే ఉండాలని, రాజకీయ వ్యవస్థను కులం శాసించరాదని అన్నారు. ఈ నెల 15వ తేదీ కవాతుతో తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్టు పవన్ చెప్పారు.
Pawan Kalyan

More Telugu News