t congress: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. చిరంజీవితో కలిసి ప్రచారానికి సిద్ధమే.. పవన్ కు ఆవేశం ఎక్కువ!: విజయశాంతి

  • 430 మండలాల్లో ప్రచారం చేస్తానని రాహుల్ కి చెప్పా
  • ‘మహాకూటమి’తో టీఆర్ఎస్ ను గద్దె దింపడం సాధ్యమే
  • కేసీఆర్ వి అహంకారపు మాటలు
ఫెడరల్ ఫ్రంట్ కు పార్టీలను ఒప్పించలేని కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చానని చెప్పడం హాస్యాస్పదమని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అహంకారపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని, టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ప్రచారం మాత్రం నిర్వహిస్తానని చెప్పిన విజయశాంతి, రాష్ట్ర వ్యాప్తంగా 430 మండలాల్లో ప్రచారం చేస్తానని రాహుల్ గాంధీకి చెప్పానని, ఎన్నికల ప్రచార షెడ్యూల్ పై కసరత్తు చేస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా ‘మహాకూటమి’ గురించి ఆమె స్పందిస్తూ, ఆహ్వానించదగిన విషయమేనని, ఈ కూటమి ద్వారా టీఆర్ఎస్ ను గద్దె దింపడం సాధ్యమేనని ఆమె అభిప్రాయపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ పెద్ద పీట వేయాలని సూచించిన విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవితో కలిసి ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించీ ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ కు ఆవేశం ఎక్కువని, రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాలని అన్నారు.
t congress
Chiranjeevi
vijayashanthi

More Telugu News