హెచ్1బీ వీసాదారులకు షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్
- హెచ్ 1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గడ్డుకాలం
- హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు
- మూడు నెలల్లోగా అధికారిక నిర్ణయం
హెచ్ 1బీ వీసాదారులు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారి జీవిత భాగస్వాములు హెచ్4 డిపెండెంట్ వీసాతో ఉద్యోగాలు చేయవచ్చంటూ గత ఒబామా ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. ఒబామా నిర్ణయం వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ఈ ఏడాది ఫిబ్రవరి 28న ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కొన్ని కారణాల వల్ల దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది.
మరోవైపు, హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే. 2017 డిసెంబర్ 25 నాటికి 1,26,853 మంది హెచ్4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను అమెరికా మంజూరు చేసింది. వీరిలో 93 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. కేవలం ఐదు శాతం మంది చైనీయులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే... ఒక్కరి జీతంతోనే కుటుంబం మొత్తం నడవాల్సి ఉంటుంది.