తల్లి బతికివస్తుందని.. మృతదేహానికి 7 నెలలుగా తాంత్రిక పూజలు!
- ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘటన
- కొడుక్కి సహకరించిన తండ్రి
- విచారణ జరుపుతున్న పోలీసులు
ఛత్తీస్ గఢ్ లోని విశ్వంపూర్ గ్రామంలో శోభ్ నాథ్ గోండ్, కాళేశ్వరి దంపతులకు అరికన్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో కాళేశ్వరి కన్నుమూసింది. దీంతో కుమారుడు సింగ్ తల్లిని తాంత్రిక పూజలతో బతికించుకుందామని తండ్రిని ఒప్పించాడు. అంత్యక్రియలు చేయకుండా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకుని గత 7 నెలలుగా తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నాడు. కాళేశ్వరి తనతో మాట్లాడుతోందని సింగ్ చెప్పేవాడు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం వీరి బంధువు ఒకరు విశ్వంపూర్ కు రావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తల్లి తనతో మాట్లాడుతోందనీ, త్వరలోనే బతికివస్తుందని సింగ్ నమ్మేవాడనీ, విచారణలో తమకూ అదే చెప్పాడని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.