krishnamraju: త్వరలోనే మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ కానున్నాం: కృష్ణంరాజు

  • మోదీపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో అవిశ్వాస తీర్మానం ద్వారా తేలిపోయింది
  • విభజన హామీలతో కేంద్రం త్వరలోనే స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది
  • బీజేపీని విమర్శించడానికి టీడీపీకి ఇకపై ఒక్క అంశం కూడా మిగలదు
దేశంలో తిరుగులేని నేత ప్రధాని మోదీనే అని సినీనటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు అన్నారు. మోదీపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉందో... అవిశ్వాస తీర్మానం ద్వారా తేలిపోయిందని చెప్పారు. అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్దతును కూడగట్టామని టీడీపీ చెప్పుకుందని... అయితే, ఏపీకి అన్యాయం జరిగిందనే విషయాన్ని మాత్రం ఏ ఒక్క పార్టీతో కూడా చెప్పించలేకపోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే విశాఖపట్నం రైల్వే జోన్, ట్రైబల్ యూనివర్శిటీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించబోతోందని చెప్పారు.

కేంద్ర మంత్రులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించబోతున్నారని... వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారని... త్వరలోనే వాటికి శాశ్వత భవనాలను నిర్మిస్తారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి మరిన్ని నిధులు అవసరమైతే... వాటికి కావాల్సిన వనరులను కేంద్రం చూపిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని చెప్పుకోవడానికి టీడీపీకి ఇకపై ఏ అంశం మిగలదని ఆయన అన్నారు. ఏపీలోని రాజకీయ పరిణామాలపై నివేదికను తయారు చేసి, ఢిల్లీ పెద్దలకు పంపుతామని చెప్పారు. త్వరలోనే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అవుతామని తెలిపారు. 
krishnamraju
bjp
modi
amit shah

More Telugu News