ఇన్ కం టాక్స్ రద్దు... పంద్రాగస్టున సంచలన ప్రకటన చేయనున్న నరేంద్ర మోదీ!

  • ప్రజా వ్యతిరేకతను తగ్గించాలన్న ఆలోచనలో మోదీ, షా
  • సునామీలా సానుకూల పవనాలు వీస్తేనే 2019 ఎన్నికల్లో గెలుపన్న భావన
  • ఆదాయపు పన్నును రద్దు చేసి బీటీటీని ప్రవేశపెట్టే ఆలోచన
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే, కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, తన నోటివెంట ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోదీపై ప్రజా వ్యతిరేకతను పెంచగా, దాన్ని తగ్గించకుంటే, గెలుపు క్లిష్టతరమవుతుందన్న ఆలోచనలో సునామీ తరహాలో సానుకూల పవనాలు వీచేందుకు ఏం చేయాలని ఆలోచించిన కమలనాథులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. దేశ ప్రజలను సంతోషంలో ముంచడానికి సిద్ధమవుతున్న మోదీ, ఆదాయపు పన్నును రద్దు చేస్తే, గెలుపు సులువవుతుందని నమ్ముతున్నట్టు తెలుస్తోంది.

ప్రతి సంవత్సరమూ బడ్జెట్ ను ప్రవేశపెట్టే వేళ, ఆదాయపు పన్ను పరిమితులను పెంచుతారా? లేదా? అని కోట్లాది మంది సగటు వేతనజీవులు ఎదురు చూస్తారన్న సంగతి తెలిసిందే. మినహాయింపులు కోరుకునే వారికి ఆదాయపు పన్నే ఎత్తేస్తున్నారని తెలిస్తే, ఊహించని రీతిలో సానుకూల పవనాలు వీస్తాయన్నది మోదీ టీమ్ ఆలోచనట.

వాస్తవానికి ఈ ప్రతిపాదన ఈనాటిది కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన వేళే వచ్చింది. నోట్ల రద్దుతో వ్యవస్థ బాగుపడుతుందని ప్రతిపాదించిన 'అర్థగ్రంధి' సంస్థ అదే సమయంలోనే ఆదాయపు పన్ను రద్దు అంశాన్నీ ప్రతిపాదించింది. నగదు రహిత సమాజం విస్తరిస్తే, ఇన్ కం టాక్స్ వసూలు అవసరం లేదని పేర్కొంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఆదాయపు పన్ను రద్దును కోరారు.

ఇక ఆదాయపు పన్నును రద్దు చేసిన పక్షంలో కేంద్ర ఖజానాకు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మరో ప్లాన్ ను కూడా మోదీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే బీటీటీ (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్). అంటే, ప్రతి బ్యాంకు లావాదేవీపైనా పన్ను ఉంటుంది. డబ్బు వేసినా, తీసినా, ఆన్ లైన్ లో ఖర్చు చేసినా, కార్డు గీకినా కొంత మొత్తం కేంద్ర ఖజానాకు చేరిపోతుంది. బీటీటీని పక్కనపెడితే, ఆదాయపు పన్ను రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకుంటే, ఆయన తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ప్రధాని నోటి వెంట పన్ను రద్దు మాటలు వస్తాయా? రావా? అన్నది వేచి చూడాల్సిందే.
Go Back to Shorts
Income Tax
August 15
Narendra Modi
BTT

More Telugu News