చుక్కలు చూపించిన ఎయిర్ ఏషియా... ప్రయాణికులను దించేందుకు ఏసీ పెంచిన పైలెట్... వాంతులతో ఇబ్బంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చుక్కలు చూపించిన ఎయిర్ ఏషియా... ప్రయాణికులను దించేందుకు ఏసీ పెంచిన పైలెట్... వాంతులతో ఇబ్బంది!

  • కోల్ కతా నుంచి ఉదయం బయలుదేరాల్సిన విమానం
  • నాలుగు గంటలు విమానంలోనే ప్రయాణికులు
  • ప్రయాణికులను దించేందుకు విపరీత చర్యకు దిగిన పైలెట్
  • చేదు అనుభవాన్ని పంచుకున్న ఐఓసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ దీపాంకర్‌ రే
కోల్ కతా నుంచి వడోదరకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం, తన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. వారిని విమానం నుంచి కిందకు దించేయడానికి విమానం పైలెట్ ఏసీని పెంచి ఇబ్బందిపెట్టాడు. ప్రయాణికుల్లో పలువురికి వాంతులు కాగా, చిన్నపిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, కోల్ కతా నుంచి బయలుదేరాల్సిన విమానానికి టేకాఫ్ కు అనుమతి రాలేదు. మొదట 30 నిమిషాల పాటు విమానం ఆలస్యం అవుతుందని పైలెట్ ప్రకటించాడు. వాస్తవానికి ఉదయం 9 గంటలకే విమానం బయలుదేరాలి. ఆపై ఒంటిగంట వరకూ విమానం కదల్లేదు. ఈ సమయంలో విమాన సిబ్బంది ప్రయాణికులకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఆపై ఎలాంటి వివరణా ఇవ్వకుండా ప్రయాణికులంతా దిగిపోవాలని పైలెట్ ఆదేశించాడు.

బయట భారీ వర్షం కురుస్తూ ఉండటంతో ప్రయాణికులు విమానం దిగేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పైలెట్ విమానంలో ఏసీని విపరీతంగా పెంచేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, కొందరికి వాంతులయ్యాయి. పిల్లలకు శ్వాస ఆడక ఏడుపులు లంఘించుకోవడంతో చేసేదేమీ లేక జోరున కురుస్తున్న వానలో విమానం దిగి వెళ్లిపోయారు. అదే విమానంలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ దీపాంకర్‌ రే ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. కాగా, పైలెట్ చేసిన చర్యపై స్పందించని ఎయిర్ ఏషియా యాజమాన్యం, విమానం ఆలస్యానికి మాత్రం క్షమాపణలు కోరింది.
Kolkata
Air Asia
Flight
Pilot

More Telugu News