Tirumala: వెంకటేశ్వర స్వామి వారి పరువు విలువ రూ. 100 కోట్లేనా?: నిప్పులు చెరిగిన రమణ దీక్షితులు

  • రమణ దీక్షితులుకు పరువు నష్టం నోటీసులు పంపిన టీటీడీ
  • రూ. 100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన అధికారులు
  • స్వామివారి పరువు విలువను ఎలా లెక్కగడతారని ప్రశ్నించిన మాజీ ప్రధానార్చకులు
  • తన ఆరోపణలపై విచారించి నోటీసులు ఇవ్వాలని సలహా
తాను శ్రీ వెంకటేశ్వరస్వామివారి పరువును తీశానని ఆరోపిస్తూ రూ. 100 కోట్లు చెల్లించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తనకు నోటీసులు పంపించారని, కోట్ల మంది కొలిచి, తమ ఇష్టదైవంగా పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ. 100 కోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు. ఈ ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, వెలకట్టలేని స్వామికి వెలకట్టిన ఘనత ఈ అధికారులకే దక్కిందని నిప్పులు చెరిగారు.

తాను చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరిపాల్సిందిపోయి, తనకు నోటీసులు ఏంటని ప్రశ్నించారు. స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన రమణ దీక్షితులు, స్వామివారి ఆస్తులను, దివ్యమైన తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని కోరారు.

నిరూపించుకున్న తరువాత తన ఆరోపణలు అసత్యమైనవిగా తోస్తే, తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చని, తన ఆరోపణలపైనే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం టీటీడీకి నగుబాటని, అధికారులకు ఈ సలహా ఇచ్చిన వ్యక్తిని చాలా పెద్ద బృహస్పతిగా భావిస్తున్నానని ఎద్దేవా చేశారు.
Tirumala
Tirupati
TTD
Ramana Deekshitulu
Press Club
Hyderabad

More Telugu News