Chandrababu: ఇ-ప్రగతి సిద్ధం.. ఎక్కడినుండైనా అన్ని ప్రభుత్వ సేవలను పొందండి: చంద్రబాబు
- సేవలందించేందుకు సిద్ధమైన ఇ-ప్రగతి పోర్టల్
- జులై 5న ఇ-ప్రగతి ఆన్ లైన్ పోర్టల్ విడుదల
- రూ.2,358 కోట్ల ఖర్చుతో శ్రీకారం చుట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇ-ప్రగతి విధానం ద్వారా రాష్ట్ర పౌరులంతా ఎక్కడినుండైనా అన్ని ప్రభుత్వ సేవలను ఒకే చోటి నుండి పొందవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.2,358 కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇ-ప్రగతి ఆన్ లైన్ పోర్టల్‌ను జులై 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో 'ఇ-ప్రగతి' ప్రాజెక్ట్ పురోగతిని సీఈఓ బాల సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
మొత్తం 33 శాఖలు, 300 కంటే ఎక్కువ ప్రభుత్వ సంస్థలు అందించే 745 G2B (ప్రభుత్వం - వ్యాపారం), G2C (ప్రభుత్వం - పౌరులు), G2E (ప్రభుత్వం - ఉద్యోగులు), G2G (ప్రభుత్వం - ప్రభుత్వం) ఇలా అన్ని రకాల సేవలను ఒకేతాటిపైకి తెచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఇ-ప్రగతి విధానానికి తెరదీసింది.
సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని మొత్తం శాఖలను రెండు దశల్లో ఇ-ప్రగతి పోర్టల్ కిందకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఇందులో రెండో దశ డిసెంబర్ నాటికల్లా సిద్ధమవుతుందని అన్నారు. పోర్టల్ డాష్ బోర్డ్‌తో పాటు సాఫ్ట్‌వేర్ లైసెన్స్ నిర్వహణ కూడా పూర్తవుతుందని అన్నారు. పోర్టల్‌లోని వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, విధి విధానాలు వేర్వేరుగా క్లుప్తంగా వివరించబడ్డాయని పేర్కొన్నారు.