Andhra Pradesh: అందుకే, ఉక్కు పరిశ్రమను ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది: ఏపీ మంత్రి అమరనాథరెడ్డి

  • టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర
  • ఏపీలో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి
  • కడపలోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఉంది 
  • ఖనిజ సంపద లేదని కేంద్రం కాకమ్మ కథలు చెబుతోంది
ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలనేదే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఏపీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. విభజన హామీల్లో ఒకటైన కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయలేమని సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో అమరనాథరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.

 "గత సార్వత్రిక ఎన్నికల్లో విభజన హామీలన్నీ నెరవేరుస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అందులో కడప స్టీల్ ప్లాంట్ కూడా ఒకటని చెప్పారు. చంద్రబాబు నాయుడుని, టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకే ఉక్కు పరిశ్రమను ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కడపలోనే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఖనిజ సంపదపై సర్వే చేసిన మెకాన్ సంస్థ కూడా వెల్లడించింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్రం ఖనిజ సంపద లేదని కాకమ్మ కథలు చెబుతోంది" అని ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై కూడా మంత్రి అమరనాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కడప స్టీల్ ప్లాంట్ తెస్తామని చెప్పిన రాష్ట్ర నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదన్నారు. నమ్మించి మోసం చేసిన కేంద్రంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని, దానిని మరింత ఉద్ధృతం చేసి కడప స్టీల్ ప్లాంట్ తో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  
Andhra Pradesh
Telugudesam
Minister

More Telugu News