మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డ సోము వీర్రాజు!

  • చంద్రబాబు లాంటి కుట్రపూరిత నేత మరెవ్వరూ లేరు
  • మోదీకి, చంద్రబాబుకు పోలికే లేదు
  • కాంగ్రెస్ తో జత కట్టేందుకు టీడీపీ రెడీ అయిపోయింది
నవ నిర్మాణ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్యాలను చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ దీక్షల కారణంగా ఉద్యోగులంతా కార్యాలయాల్లో లేకపోవడంతో ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పారు. 2014లో బీజేపీ, జనసేనల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు.

కుమారుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి, తాను ప్రధాని కావాలని చంద్రబాబు భావిస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. మోదీని దేశ ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారని... చంద్రబాబు ప్రధాని కావాలని ఎప్పుడూ, ఎవరూ అనుకోలేదని చెప్పారు. మోదీకి, చంద్రబాబుకు పోలికే లేదని ఎద్దేవా చేశారు. మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ... రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం టీడీపీ ఎన్నడూ సహకరించలేదని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి కుట్రపూరిత రాజకీయ నాయకుడు మన దేశంలో ఇంకెవ్వరూ లేరని అన్నారు. ఏపీలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు టీడీపీ రెడీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ లాంటి పార్టీలకు బీజేపీ భయపడదని అన్నారు.
Go Back to Shorts
Chandrababu
modi
somu veerraju
BJP
Telugudesam

More Telugu News