Chandrababu: కేంద్రం చెప్పినట్టు తైతక్కలాడుతూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారు: చంద్రబాబు

  • వైసీపీ చెవుల్లో పూలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • అర్చకుడిని అడ్డం పెట్టుకుని డ్రామాలాడాలని చూశారు
  • ప్రజల ఆశీస్సులతో కొండనైనా ఢీకొడతా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు కేంద్రంతో అవగాహన కుదుర్చుకుని, అది చెప్పినట్టు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాజీనామాలు చేసినట్టు చెప్పుకుంటూ జనం చెవుల్లో పూలు పెడుతున్నారని అన్నారు. అయితే, వారి చెవుల్లో ప్రజలే పూలు పెడతారని, ఆ రోజులు ఎంతో దూరంలేవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకునే పార్టీలను, అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పార్టీలను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో సోమవారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ కుట్రలో భాగంగానే జగన్, పవన్‌లు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించకుండా తాను అడ్డుపడినట్టు జగన్ కొత్త నాటకం ఆడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా వదులుకున్నామన్నారు. ఒక అర్చకుడిని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడాలని చూశారని దుయ్యబట్టారు. కర్ణాటకలో గాలి జనార్దనరెడ్డిని, రాష్ట్రంలో జగన్‌ వంటి అవినీతి పరులను కేంద్రం రక్షిస్తోందని మండిపడ్డారు. తన జీవితం ప్రజా సేవకే అంకితమని, వారి ఆశీస్సులతో కొండనైనా ఢీకొడతానని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Telugudesam
Vizianagaram
YSRCP

More Telugu News