Srikakulam: శ్రీకాకుళంలో మరో సరస్వతి! పెళ్లైన 20 రోజులకే భర్త గొంతు కోసిన భార్య!

  • బైక్‌పై వెళ్తుండగా భర్తపై దాడి
  • వెనక నుంచి గొంతు కోసి పరారీ
  • చావుబతుకుల మధ్య భర్త
పెళ్లైన పది రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన సరస్వతి గురించి మర్చిపోకముందే అటువంటిదే మరో ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివాహమైన 20 రోజులకే భర్త మెడను దారుణంగా కోసిన నవ వధువు అతడిని చంపేందుకు ప్రయత్నించింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో వెనక కూర్చున్న భార్య.. కత్తితో అతడి గొంతు కోయడం జిల్లాలో సంచలనమైంది. సంతబొమ్మాళి మండలం కోటబొమ్మాళిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మండలంలోని మాలనర్సాపురం గ్రామానికి చెందిన సింహాచలం అలియాస్ నవీన్ కుమార్ (23)కు అదే మండలంలోని గొదలాం గ్రామానికి చెందిన నీలిమ (19)తో ఈనెల 9న వివాహమైంది. సోమవారం సాయంత్రం కొత్త దంపతులు గొదలాం నుంచి బైక్‌పై నర్సాపురం బయలుదేరారు. కోటబొమ్మాళి రైలు నిలయం సమీపంలోకి రాగానే నీలిమ అకస్మాత్తుగా చాకుతో భర్తపై దాడి చేసి గొంతు కోసేందుకు ప్రయత్నించింది.

తీవ్ర గాయాలపాలైన నవీన్ కింద పడిపోయాడు. నీలిమ అక్కడి నుంచి పరారైంది. నవీన్‌ను వెంటనే శ్రీకాకుళంలోని ‘రిమ్స్’కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతబొమ్మాళి సమీపంలో నీలిమను అదుపులోకి తీసుకున్నారు.
Srikakulam
wife
Husband
murder

More Telugu News