bheema varam: ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇప్పుడు ఆయన జయంతి వేడుకలు చేస్తున్నారు!: వైఎస్ జగన్ వ్యంగ్యం

  • ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
  • ఎన్టీఆర్ ట్రస్ట్, ఆయన ఇల్లు, పార్టీని కూడా లాగేసుకున్నారు
  • నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతి మయం
  • మా ప్రభుత్వం రాగానే ఐస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లకు రూ.5 కే కరెంట్  
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఈరోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, ఎన్టీఆర్ ట్రస్ట్, ఆయన ఇల్లు, పార్టీని లాగేసుకున్నారని.. చివరకు ఆయన మృతికి కూడా చంద్రబాబే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేశారంటూ ఏపీ మహానాడులో మొసలికన్నీరు కార్చిన చంద్రబాబు, తెలంగాణ మహానాడులో తన వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదని, బాబు పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటిస్తామని మేం ప్రకటించాక.. ఎన్నికలకు ఒక సంవత్సరం ఉందనగా చంద్రబాబు రెండు రూపాయలకు యూనిట్ కరెంట్ ఇస్తామని, అది కూడా సంవత్సరం వరకు మాత్రమేనని ప్రకటించారని జగన్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఐస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లకు రూ.5 కే కరెంట్ ఇస్తామని, దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపి, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, కోల్డు స్టోరేజీలు నెలకొల్పుతామని అన్నారు. ఆక్వా రైతులకు అండగా నిలుస్తామని, నాలుగో సంవత్సరంలో ఆక్వా పంటకు మద్దతు ధర కూడా ప్రకటిస్తామని అన్నారు.
bheema varam
ys jagan

More Telugu News