కీలక పరిణామం... స్పీకర్ పదవిని కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సిద్ధమైన కుమారస్వామి!

  • రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి
  • కీలకమైన పదవులను కాంగ్రెస్ కు ఇచ్చేందుకు అంగీకారం!
  • రెండో ఉప ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకోని కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి, అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కూటమిలో అత్యధిక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నందున, ఆ పార్టీ ఎమ్మెల్యేకు సభను నిర్వహించే బాధ్యతలు అప్పగించాలని, నిన్న రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం కుమారస్వామి ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇప్పటికే ఓ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కాంగ్రెస్ కు ఇచ్చేందుకు సిద్ధపడ్డ ఆయన, రెండో ఉప ముఖ్యమంత్రి పదవిపై మాత్రం ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటివరకూ ఇరు పార్టీల మధ్యా అధికార పంపిణీపై ఎటువంటి చర్చలూ సాగలేదని నేతలు చెబుతున్నప్పటికీ, ముందే మంత్రుల పేర్లు చెబితే, ఎమ్మెల్యేల నుంచి ధిక్కారస్వరం వస్తుందన్న ఆలోచనలో, బల నిరూపణ తరువాతే మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించాలని రెండు పార్టీలూ నిర్ణయానికి వచ్చాయి. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న విషయమై కాంగ్రెస్ ఓ జాబితాను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. ఆ పార్టీ జాతీయ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, రాష్ట్ర ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ ఈ విషయంలో చర్చిస్తున్నారు.

డిప్యూటీ సీఎం పోస్టుకు దళిత నేత జీ పరమేశ్వర ముందున్నట్టు తెలుస్తుండగా, తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. రెండో డిప్యూటీ సీఎం పదవి తెరపైకి వస్తే, వీరశైవ - లింగాయత్ వర్గానికి అది దక్కవచ్చని కూడా తెలుస్తోంది. కర్ణాటకలో ముఖ్యమంత్రి సహా 34 మంది మంత్రులుగా కొలువుదీరే అవకాశం ఉండగా, తొలిదశలో కాంగ్రెస్ నుంచి 20, జేడీఎస్ నుంచి 10 మందికి చాన్స్ లభించవచ్చని తెలుస్తోంది.
Go Back to Shorts
Kumaraswamy
Karnataka
Speaker
Deputy CM

More Telugu News