పెళ్లింట్లో విషాదం.. వివాహమైన ఐదు రోజులకే ప్రమాదంలో వరుడి మృతి

  • రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వరుడు
  • రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ప్రమాదం
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న నవ వధువు
పెళ్లికొచ్చిన బంధువులు ఇంకా వెళ్లనేలేదు. వధువు కాళ్ల పారాణి ఆరనే లేదు. పెళ్లి ముచ్చట్లు ఇంకా కొనసాగుతుండగానే పెను విషాదం చోటు చేసుకుంది. వివాహమైన ఐదు రోజులకే రోడ్డు ప్రమాదంలో వరుడు మరణించిన విషాద ఘటన ఇది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడుకు చెందిన పున్యం సాంబయ్య (24)కు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన యువతితో ఈనెల 3న ఘనంగా వివాహమైంది. కొత్త దంపతులు సోమవారం అత్తవారింటికి వెళ్లారు.

సాయంత్రం స్వీట్లు తెచ్చేందుకు బంధువు రేగెళ్ల ఆదినారాయణతో కలిసి సాంబయ్య బైక్‌పై మణుగూరు బయలుదేరాడు. ఈ క్రమంలో గొట్టెల గ్రామం వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సాంబయ్య, ఆదినారాయణలను వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా సాంబయ్య మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆదినారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలిసి రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన నవ వధువు.. విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
Go Back to Shorts
Telangana
Jayashankar Bhupalpally District
marriage

More Telugu News