Andhra Pradesh: ఏపీ బీజేపీ అధ్యక్ష బరిలో కన్నా, ఆకుల మధ్య పోటీ!

  • హరిబాబుకు కేంద్ర పదవి ఇచ్చే అవకాశం
  • అధ్యక్ష బాధ్యతలు కన్నాకు అప్పగించాలంటున్న ఓ వర్గం
  • టీడీపీపై దూకుడుగా వెళ్లాలంటే ఆయనే కరెక్టన్న అభిప్రాయం
  • పోటీలో మాణిక్యాలరావు, సోము వీర్రాజు కూడా
ఏపీ బీజేపీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కంభంపాటి హరిబాబు రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు పలువురు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

ఇక మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య మిత్రబంధం తెగిపోయిన నేపథ్యంలో ఆ పార్టీపై దూకుడుగా వెళ్లాలంటే కన్నా లక్ష్మీనారాయణే సరైన వ్యక్తని కొందరు బీజేపీ నేతలు తమ అభిప్రాయాన్ని అమిత్ షా ముందు వెలువరించినట్టు తెలుస్తోంది.

కాగా, టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను బీజేపీ వైపు తిప్పాలంటే కన్నా లక్ష్మీ నారాయణ వంటి వ్యక్తికే పదవి ఇవ్వాలని కావూరి సాంబశివరావు వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే పదవికి పోటీ పడుతున్న కాపు సామాజిక వర్గం నేత, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇప్పటికే న్యూఢిల్లీ చేరుకున్నారు. నేడు ఆయన పలువురు బీజేపీ నేతలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.

కన్నాను వ్యతిరేకిస్తున్న బీజేపీలోని ఓ వర్గం ఆర్ఎస్ఎస్ తో మంచి అనుబంధం ఉన్న పైడికొండల మాణిక్యాలరావుకు అధ్యక్ష పదవిని ఇవ్వాలని పట్టుబడుతోంది. కన్నా లక్ష్మీనారాయణ ఎన్నాళ్లు బీజేపీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందన్నది వీరి వాదన. ఏదిఏమైనా ఈ విషయంలో అమిత్ షాదే తుది నిర్ణయం. ఇదిలా ఉంచితే, గడచిన నాలుగేళ్లుగా ఏపీలో కీలకంగా వ్యవహరించిన హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. 
Andhra Pradesh
BJP
Kambhampati Haribabu
Kanna Lakshminarayana
Somu Veeraju
Paidikondala
Amit sha

More Telugu News