Pawan Kalyan: ప్రధాని మోదీ దీక్షపై మండిపడ్డ పవన్ కల్యాణ్‌... ఉద్యమ కార్యాచరణపై వామపక్ష నేతలతో చర్చ

  • ప్రధాని దీక్ష నమ్మశక్యంగా లేదు
  • మోదీ పార్లమెంటరీ విధానాలపై గౌరవం చూపలేదు
  • కేజ్రీవాల్ నిరసన తెలిపితే అపహాస్యం చేశారు
  • ఇప్పుడు వారే దీక్షలు చేస్తున్నారు
'ప్రమాణ స్వీకారం చేసే ముందు పార్లమెంట్ మెట్లకు మొక్కి అడుగు పెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పార్లమెంటరీ విధానాలు, సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుందని ప్రజలందరూ అనుకొన్నారు.. ఆయన అవిశ్వాస తీర్మానంపై అనుసరించిన తీరుతో పార్లమెంటరీ విధానాలపై ఏ మాత్రం గౌరవం చూపలేదని అర్థం చేసుకోవచ్చు' అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనీయలేదంటూ ప్రధానమంత్రి చేస్తోన్న దీక్ష నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు. ఎవరైతే సభను సాగనీయకుండా చేశారో.. వాళ్లే తాము బాధితులం అన్న రీతిలో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ రోజు పవన్ కల్యాణ్ తో సీపీఎం, సీపీఐ నేతలు హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా సాధనకు చేపట్టే కార్యక్రమాల కార్యాచరణ, ప్రధాన మంత్రి, బీజేపీ చేపట్టిన దీక్ష తదితర అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16న రాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో... ఆ బంద్ కు మద్దతు ఇవ్వాలని జనసేన, సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... "ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకి లెఫ్ట్ నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని నిరసన చేస్తే అపహాస్యం చేసినవాళ్లు ఇప్పుడు అదే తరహాలో దీక్షలు చేస్తున్నారు. ప్రధాని ఓ బలీయమైన శక్తి అని ప్రజలతోపాటు నేనూ విశ్వసించాను. ఇప్పుడు అవిశ్వాసం చర్చకు రాకుండా చేసి ఆ నమ్మకాన్ని కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలోనూ, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలోనూ భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులు ఉన్నాయి. అందుకే దాటవేత ధోరణిలో వెళ్లారు. అవిశ్వాసంపై రెండు రోజులు చర్చిస్తే అన్నీ తెలిసేవి. చర్చ చేపట్టి ఉంటే వారి చిత్తశుద్ధి తెలిసేది. అలాగే టీడీపీ, వైసీపీల తప్పులున్నాయి. చర్చకు రాకుండా చూడటం మూడు పార్టీలకీ అవసరమే... ఇప్పుడు వాళ్లే నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Jana Sena
Hyderabad

More Telugu News