నీరవ్ కుంభకోణానికి భయపడక్కర్లేదు.. మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గట్టిది!: బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్
- నీరవ్ కుంభకోణంపై ఆందోళన అవసరం లేదు
- భారతీయ బ్యాంకుల్లో కావాల్సినంత డబ్బు ఉంది
- కుంభకోణాల భారం వినియోగదారులపైనే పడుతుంది
భారత్ బ్యాంకింగ్ రంగం పరిమాణం కోటి కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారి నుంచి ఏటా 12% వడ్డీ వసూలు చేస్తాయని ఆయన చెప్పారు. అదే సమయంలో బ్యాంకుల్లో డబ్బు దాచుకునే వినియోగదారులకు కేవలం 4% వడ్డీని మాత్రమే ఇస్తారని ఆయన తెలిపారు. అంటే రుణాల నుంచి బ్యాంకులు వసూలు చేసే వడ్డీలో 8% బ్యాంకులకే మిగులుతాయని ఆయన వెల్లడించారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా గట్టిదని తెలిపిన ఆయన, ఊహించనివి ఏవైనా జరిగితే కాపాడుకునేందుకు బ్యాంకుల వద్ద కావాల్సినంత డబ్బు ఉందని అన్నారు.
ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు బ్యాంకులు వినియోగదారుల నుంచి కొంత మొత్తం కవర్ చేసుకునేలా చూస్తాయని, అందులో భాగంగా బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారికి సాధారణంగా ఇచ్చే 4% వడ్డీ కాకుండా 3% వడ్డీని మాత్రమే ఇస్తాయని ఆయన స్పష్టం చేశారు. కనుక భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కాగా, పీఎన్బీ మోసం కేసులో నీరవ్ మోదీ, అతని మేనమామ మేహుల్ చోక్సీకి సీబీఐ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. నీరవ్ హాంగ్ కాంగ్ లో ఉన్నాడని గుర్తించి, అతనిని స్వదేశం రప్పించేందుకు చర్యలు చేపడుతున్న సంగతి కూడా తెలిసిందే.