Andhra Pradesh: ఏపీలో త్వరలో నిరుద్యోగ భృతి : మంత్రి కొల్లు రవీంద్ర

  • నిరుద్యోగ భృతి విధి విధానాలు తుది రూపుకు చేరుకున్నాయి
  • ‘మిషన్ ఎవరెస్టు’తో యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించాం
  • రాష్ట్రంలో సాహస పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాం
ఏపీ నిరుద్యోగ యువతకు త్వరలో నిరుద్యోగ భృతి అందజేయనున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించనున్న రాష్ట్రానికి చెందిన ఆరుగురు యువతీ యువకులకు అభినందనలు తెలిపే కార్యక్రమం సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి అమలుకు సంబంధించిన విధివిధానాలు రూపకల్పన తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి ద్వారా రాష్ట్రంలో ఉన్న యువత తమ స్కిల్ డవలప్ మెంట్ ను పెంచుకోడానికి ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో క్రీడలతో పాటు సాహస పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా ‘మిషన్ ఎవరెస్టు’కు శ్రీకారం చుట్టామని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే యువతకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహమిస్తోందని చెప్పారు.గత ఏడాది ఆరుగురు యువకులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారన్నారు. ఈ ఏడాది కూడా మరో ఆరుగురిని ఎంపిక చేశామని, తొలుత ఎవరెస్టు శిఖరం అధిరోహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 130 మందిని ఎంపిక చేశామని, అన్ని రకాల వడపోతల తరవాత చివరగా ఆరుగురికి ఎవరెస్టు శిఖరం అధిరోహించడానికి అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఆరుగురిలో ఒక అమ్మాయి కూడా ఉందని, ఈ నెల 9న బయలుదేరి, జూన్ నాటికి వారు వెనుదిరిగి వస్తారని చెప్పారు.

 ‘ఎవరెస్టు మిషన్’ కోసం రాష్ట్ర  ప్రభుత్వం రూ.2.80 కోట్లను వెచ్చిస్తోందని, భవిష్యత్తులో ఎవరెస్టు అధిరోహించడానికి మరింత ఎక్కువ మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సాహం అందజేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో అడ్వంచర్ అకాడమీని నెలకొల్పుతాం 

అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో అడ్వంచర్ అకాడమీని నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన వారికి భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని, మిషన్ ఎవరెస్టు ముఖ్య లక్ష్యం యువతలో ఆత్మవిశ్వాసం, ధృడసంకల్పంతో పాటు ఉత్సాహాన్ని నింపడమేనని చెప్పారు. 
Andhra Pradesh
Kollu Ravindra

More Telugu News