Chandrababu: ఢిల్లీలో కీలక నేతలను చంద్రబాబు కలవనున్నారు : ఎంపీ కేశినేని నాని

  • ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఆయా పార్టీల నేతలను చంద్రబాబు కలుస్తారు
  • ఏపీకి జరిగిన అన్యాయాన్ని వారికి వివరించి చెబుతారు
  • వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడుతున్నారు : కేశినేని
ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఢిల్లీలో కీలక నేతలను సీఎం చంద్రబాబునాయుడు కలవనున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన పార్టీల నేతలను చంద్రబాబు కలిసి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నట్టు చెప్పారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలు, ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడంపై జాతీయ మీడియాతోనూ చంద్రబాబు మాట్లాడనున్నారని అన్నారు.

ఈ సందర్భంగా వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామాల డ్రామా ఆడుతున్నారని, వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించరనే విషయం ఢిల్లీలో అందరికీ తెలుసని అన్నారు. లోక్ సభలో మళ్లీ అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తామని, రాష్ట్రం కోసం పోరాడాలని ప్రజలు ఎంపీలను ఢిల్లీకి పంపారని, తాము రాజీనామాలు చేస్తే లోక్ సభలో ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాల కోసం తమ శాయశక్తులా పోరాడతామని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని కేశినేని స్పష్టం చేశారు.
Chandrababu
mp kesineni

More Telugu News