యువతులకు వివాదాస్పద సలహా ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే!
- అబ్బాయిలతో స్నేహం చేయకపోవడమే వారికి రక్షణ
- అబ్బాయిలు కూడా పాశ్చాత్య ఫ్యాషన్‌ను విడిచిపెట్టాలి
- వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శాక్య
‘‘అసలు మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? అబ్బాయిలతో వారు స్నేహం చేయడం ఆపేస్తే వారిపై దాడులు కూడా ఆగిపోతాయి. ఇది వారికే మంచిది కదా’’ అని పేర్కొన్నారు. గుణలోని ఓ ప్రభుత్వ కాలేజీలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఏం చేయాలన్న ఓ విలేకరి ప్రశ్నకు ఆయనీ వివాదాస్పద సలహా ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మనది కాదని, అది కూడా పాశ్యాత్య సంస్కృతిలో భాగమేనని అన్నారు.
‘‘భారతీయ సంస్కృతిలో మహిళలను గొప్పగా గౌరవిస్తాం. ఏడాదికి నాలుగు సార్లు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. వారిని నాలుగుసార్లు పూజిస్తున్నాం’’ అని శాక్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దేశభక్తిని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. తాజాగా యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.