Jagan: చంద్రబాబు గారు.. ఓటుకు కోట్లు వంటి దిగజారుడు రాజకీయాలు చేయమని తెలుగు జాతి ఏమైనా చెప్పిందా ?: వైసీపీ అధినేత జగన్
- ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి చంద్రబాబు బలహీనపడ్డారు
- ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారు
- చంద్రబాబు బాధపడిపోయినట్లు చూస్తే విడ్డూరంగా ఉందన్న జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టర్ ని పెట్టి పలు విమర్శలు చేశారు. ‘నేను బలహీనపడితే.. ఆంధ్రప్రదేశ్ బలహీనపడుతుంది.. ప్రజలకు నష్టం జరుగుతుంది’ అంటూ చంద్రబాబు గారు తెగ బాధపడిపోయినట్లు పత్రికల్లో వచ్చిన వార్త చూడగానే చాలా విడ్డూరం అనిపించింది. నిజమే.. ఓటుకు కోట్లు లాంటి అనేక అవినీతి కేసులతో ఆయన బలహీనపడ్డారు. ఆయన గారు కేసుల్లో ఇరుక్కుని తన ఒక్కడి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టడంతో నిజంగా రాష్ట్రమూ కూడా బలహీనపడింది.
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర అడ్డంగా దొరికిపోయి.. వాటి నుండి బయట పడటం కోసం సాగర్ జలాలు మొదలుకుని.. ప్రత్యేక హోదా వరకూ రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టుపెట్టారు. బాబు గారి పాపాలు ప్రజలకు శాపాలుగా మారుతుంటే రాష్ట్రం బలహీనపడక మరేమవుతుంది? ఆయన చేసిన తప్పుడు పనులను నిలదీస్తే.. తెలుగు జాతిపై దాడి.. అంటున్నారు. మరి ‘ఓటుకు కోట్లు’ చేయాలని ఆయనకేమైనా తెలుగు జాతి చెప్పిందా? తప్పుడు పనులేమైనా చేయాలని రాష్ట్ర ప్రజలేమైనా పురమాయించారా?' అంటూ చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు చేశారు.