whatsapp: వాట్సాప్ లో పేమెంట్ సేవలు... మరి ఫోన్ పోతే దుర్వినియోగం జరగకుండా ఎలా..? వాట్సాప్ రికవరీ ఎలా...?

  • వెంటనే సిమ్ కార్డులు బ్లాక్ చేయించాలి
  • డీయాక్టివేట్ చేయాలని కోరుతూ వాట్సాప్ టీమ్ కు ఈ మెయిల్
  • 30 రోజుల్లోపు మళ్లీ రీయాక్టివేషన్ కు అవకాశం

వాట్సాప్ నేడు ప్రతీ స్మార్ట్ ఫోన్లో ఉండే కమ్యూనికేషన్, మెస్సేజింగ్ యాప్. భారత్ లో 20 కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారు. వాట్సాప్ తాజాగా పేమెంట్ సేవల్ని ఆరంభించింది. అంటే వాట్సాప్ నుంచే యూపీఐ ఆధారిత పేమెంట్స్ చేయవచ్చు. మరి ఈ నేపథ్యంలో పొరపాటున ఫోన్ కోల్పోతే, చోరీకి గురైతే భద్రత పరంగా ఏం చేయాలన్నది చూద్దాం.

ఫోన్ వేరే వారి చేతిలో పడితే వాట్సాప్ ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ముందుగా ఆ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు నెట్ వర్క్ సంస్థలకు కాల్ చేసి బ్లాక్ చేయించాలి. అలా చేస్తే ఆ నంబర్లపై వాట్సాప్ ఆథెంటికేషన్ మరొకరు చేయడానికి సాధ్యపడదు. తర్వాత డూప్లికేట్ సిమ్ తీసుకుని మరొక హ్యాండ్ సెట్ లో వేసుకున్న తర్వాత అదే నంబర్ పై తిరిగి వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా కోల్పోయిన డేటాను రికవరీ చేసుకోవచ్చు. ఒక నంబర్ పై వాట్సాప్ ఏక కాలంలో ఒకే హ్యాండ్ సెట్ లో పనిచేస్తుంది. కనుక మరొకరు వాడుకునే అవకాశం ఉండదు.

లేదంటే వాట్సాప్ టీమ్ కు ఈ మెయిల్ చేయవచ్చు. ‘‘ Lost/stolen: Deactivate my account’’ అన్నదాన్ని ఈ మెయిల్ సబ్జెక్ట్ లో పేర్కొనాలి. కంట్రీ కోడ్, మొబైల్ నంబర్ తెలియజేస్తూ ఆ నంబర్ పై ఉన్న వాట్సాప్ ను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేయాలని కోరొచ్చు. మీ హ్యండ్ సెట్ వేరే వారి చేతిలో పడిన తర్వాత అందులోని సిమ్ కార్డులను బ్లాక్ చేయించినప్పటికీ... అప్పటికే ఆథెంటికేట్ చేసి ఉండడం వల్ల వైఫై పై వాట్సాప్ పనిచేస్తుంది. అందుకే అకౌంట్ ను డీయాక్టివేట్ చేయాలని కోరుతూ వాట్సాప్ కు మెయిల్ చేయాలి. తిరిగి దాన్ని రీయాక్టివేట్ చేసుకోవడానికి యూజర్ కు 30 రోజుల సమయం ఉంటుంది. అంటే అప్పటి వరకు డేటా అంతా భద్రంగా సేవ్ అయి ఉంటుంది. 30 రోజుల తర్వాత ఆ నంబర్ పై ఉన్న వాట్సాప్ తాలూకు డేటా అంతా ఎరేజ్ చేయడం జరుగుతుంది.

More Telugu News