Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti: యూరీ దాడి తర్వాత అంతటి దారుణం...ఐదుగురు జవాన్లను బలిగొన్న ఉగ్రమూక!

  • క్షతగాత్రుల్లో జూనియర్ ఆర్మీ అధికారి కుమార్తె
  • క్యాంపు సమీపంలోని స్కూళ్ల మూసివేత
  • కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్
జమ్మూలోని సంజువాన్ ఆర్మీ శిబిరంపై శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన దాడి యూరీ-2016 దాడి తర్వాత ఒకానొక అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు అభివర్ణించారు.  నాడు యూరీ ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరిగిన ఈ దాడిలో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు మరణించిన సంగతి తెలిసిందే.

 మరోవైపు భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. భారీ మారణాయుధాలతో ఉగ్రవాదులు సంజువాన్ క్యాంపుపై దాడికి తెగబడి 24 గంటలు దాటిన తర్వాత కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తొమ్మిది మంది గాయపడ్డారని, స్థావరం లోపల నుండే కనీసం ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు కొనసాగిస్తున్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఉగ్రవాదులు క్యాంపు వెనుక వైపు నుండి ప్రవేశించారని, దీనిని జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు తెలిపాయి. క్షతగాత్రుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారిలో జూనియర్ ఆర్మీ అధికారి కుమార్తె కూడా ఉంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం సాయంత్రం జమ్మూలోని మిలిటరీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు.

ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను సమీక్షించడం కోసం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదివారం ఉదయం జమ్మూ చేరుకున్నారు. ప్రస్తుతం జమ్మూలో హై అలెర్ట్ కొనసాగుతోంది. మరోవైపు సంజువాన్ ఆర్మీ క్యాంపుకు సమీపంలోని స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం గాలింపు ఆపరేషన్లు కొనసాగిస్తున్న భారత జవాన్లు విజయవంతంగా పని పూర్తి చేస్తారని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Jammu and Kashmir Chief Minister Mehbooba Mufti
Sunjuwan Army camp
Jaish-e-Mohammed

More Telugu News