పాకిస్థాన్ ను వదిలి వెళ్లిపోయిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య!
- రెహం ఖాన్ కు బెదిరింపు కాల్స్
- కుమార్తెను తీసుకుని.. దేశం విడిచి వెళ్లిన ఇమ్రాన్ రెండో భార్య
- త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని ప్రకటన
శనివారంనాడు ఇస్లామాబాద్ నుంచి 'ఇండియా టీవీ'తో ఆమె మాట్లాడుతూ, బుస్రా మనేకాతో ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం సంగతి తనకు తెలుసని చెప్పారు. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇమ్రాన్ ఆ విషయాన్ని అధికారికంగా బహిర్గతం చేయడం లేదని అన్నారు. ఈ విషయాన్ని వెల్లడించడంలో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చని, లేదా మూడో పెళ్లి గురించి బయటకు చెప్పడానికి ఇది సరైన సమయం కాదని ఆయన భావిస్తుండవచ్చని తెలిపారు. పలు విషయాలపై ఇప్పటిదాకా తాను మౌనంగానే ఉన్నానని... త్వరలోనే అన్ని విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు. తొలుత ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా ఉన్న రెహం ఖాన్... ఇమ్రాన్ ను పెళ్లాడి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే, ఆమె పోటీ చేయకుండా ఇమ్రాన్ అడ్డుకున్నారు. దీంతో, వీరి మధ్య అగాధం పెరిగి, చివరకు విడాకులతో ముగిసింది.