Rajouri: రాజౌరీ సెక్టార్‌లో పాక్ గుళ్ల వర్షం.. కెప్టెన్ సహా అమరులైన నలుగురు జవాన్లు

  • సరిహద్దులో కొనసాగుతున్న పాక్ కాల్పులు
  • సరిహద్దులో ఉద్రిక్తత
  • పాఠశాలలు మూసివేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆర్మీ
  • దీటుగా బదులిస్తున్న ఇండియన్ ఆర్మీ
పాకిస్థాన్ మరోమారు తెగబడింది. భారత ఆర్మీ సెక్టార్‌పై తూటాల వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో ఆర్మీ సెంకెండ్ ఆఫీసర్ కెప్టెన్ కపిల్ కుందు ఉన్నారు. గత 40 రోజులుగా పాక్ జరుపుతున్న కాల్పుల్లో ఆర్మీ అధికారి చనిపోవడం ఇది రెండోసారి.

సుందర్‌బని ప్రాంతంలో కూడా పాకిస్థాన్ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. ఈ ఘటలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారు. ఆదివారం ఉదయం షాపూర్ సెక్టార్‌లో పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు, ఓ జవాను గాయపడ్డారు. పాక్ కాల్పులతో విరుచుకుపడుతుండడంతో రాజౌరీ సెక్టార్‌లో సరిహద్దుకు సమీపంలో ఉన్న 84 పాఠశాలలను మూసివేయించారు. మూడు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అలాగే సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పాక్ కాల్పుల్లో అమరులైన వారిలో మిగతా వారిని రైఫిల్ మ్యాన్‌లు రామ్ అవతార్, శుభం సింగ్, హవల్దార్ రోషన్ లాల్, జవాను నియాక్ ఇక్బాల్ అహ్మద్‌లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి  తరలించారు. పాక్ కాల్పులకు భారత దళాలు దీటుగా బదులిస్తున్నట్టు ఆర్మీ అధికారిక ప్రతినిధి తెలిపారు.
Rajouri
Jammu And Kashmir
Pakistan
ceasefire

More Telugu News