పవన్ కల్యాణ్ పర్యటన విజయవంతంపై ‘జనసేన’ కృతఙ్ఞతలు

తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో జనసేన పార్టీ అధినేత పనన్ కల్యాణ్ ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, అనంతపురం జిల్లాల్లో పవన్ జరిపిన పర్యటనను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ‘జనసేన’ కృతఙ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ దృష్టికి పలు సమస్యలు వచ్చాయని, ముఖ్యంగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కరవునకు కారణాలను ప్రజాప్రతినిధులు రైతులు, మేధావులు పవన్ కు తెలియజేశారని పేర్కొంది.

ఈ సమస్యలపై నిపుణులు, పార్టీలోని కొందరు ముఖ్యులతో కలిసి సమస్యలను విశ్లేషించే కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారని, గత మూడు రోజులుగా పార్టీ పరిపాలనా కార్యాలయంలో విశ్లేషణ జరుగుతోందని తెలిపింది. అనంతపురం నీటి కష్టాలపై జనసేన అధ్యక్షుడు చర్చించారని, పవన్ తన పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తారని పేర్కొంది. పవన్ కల్యాణ్ మలి విడత పర్యటనకు కావలసిన ప్రణాళికను పార్టీ ప్రతినిధులు రూపొందిస్తున్నారని, అందుకు సంబంధించిన తేదీలు ఖరారు కావాల్సి ఉందని, ఆ వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.


More Telugu News