చదువుల తల్లికి వీసా సాయం.. మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న సుష్మా స్వరాజ్!
- విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థినికి సాయం
- వీసా ఇప్పించి తన వంతు సాయం
- అమెరికాలో చదవనున్న రాజస్థాన్ విద్యార్థిని
జలాల్పుర్కు చెందిన భానుప్రియ హరిత్వాల్ 10, 12 తరగతుల్లో విశేష ప్రతిభ కనబరిచి.. ఉన్నతవిద్య కోసం రాజస్థాన్ ప్రభుత్వం అందించే కోటి రూపాయల ఉపకారవేతనానికి ఎంపికైంది. కాలిఫోర్నియా స్టేట్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చేయాలని ఆశించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్గత పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించింది.
ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. విదేశాలకు వెళ్లాలంటే వీసా కావాలి.. అందుకోసం ఆమె దరఖాస్తు చేసుకోగా దౌత్య కార్యాలయం 2 సార్లు తిరస్కరించింది. విదేశీ విద్యాలయంలో సీటు సాధించినప్పటికీ వీసా జారీ కాకపోవడంతో వెళ్లలేకపోయింది. దీంతో భానుప్రియ కుటుంబం స్థానిక ఎంపీని ఆశ్రయించింది. ఆయన చొరవ తీసుకుని మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె వెంటనే స్పందించి వీసా వచ్చేలా చేశారు.