Rajinikanth: రజనీకాంత్ పార్టీ చిహ్నం నుంచి తామరపూవు ఔట్.. పాము బొమ్మ ఇన్!

  • తామరపువ్వు కారణంగా రజనీ వెనక బీజేపీ ఉందన్న ప్రచారం
  • స్పందించిన రజనీ చిహ్నాన్ని మార్చనున్నట్టు వార్తలు
  • పాము బొమ్మతో కొత్త చిహ్నం చక్కర్లు

రాజకీయ పార్టీ ప్రకటించి సంచలనం రేపిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూడు రోజుల వ్యవధిలోనే పార్టీ చిహ్నంపై మార్పులు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తామరపువ్వు మధ్యలో బాబా ముద్రతో కూడిన చేయి గుర్తును పెడతారని అందరూ భావించారు. అయితే తామరపువ్వు బీజేపీ గుర్తు కాబట్టి, రజనీ రాజకీయ ప్రవేశం వెనక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో మరిన్ని విమర్శలు రాకముందే పార్టీ చిహ్నాన్ని మార్చాలని ‘తలైవా’ భావిస్తున్నట్టు సమాచారం. తామరపువ్వు స్థానంలో పామును చేర్చాలని నిర్ణయించారట. ఇందుకు సంబంధించిన బొమ్మ కూడా ఇప్పుడు చక్కర్లు  కొడుతోంది. అయితే పార్టీ పేరు, చిహ్నాన్ని ఎప్పుడు ప్రకటించేది రజనీ ఇప్పటి వరకు వెల్లడించలేదు.

గతేడాది చివరి రోజున రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో తన పార్టీ మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించి సంచలనం రేపారు. కాగా, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మలేసియా వెళ్లనున్న రజనీకాంత్, కమల హాసన్‌లు ఈనెల 6న అక్కడ భేటీ కానున్నట్టు సమాచారం.

More Telugu News