varun gandhi: 35 ఏళ్ల తరువాత కలవనున్న దాయాదులు... కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ?

  • మధ్యవర్తిత్వం చేస్తున్న ప్రియాంకా గాంధీ
  • త్వరలోనే చేరిక ఖాయమంటున్న కాంగ్రెస్ వర్గాలు
  • బీజేపీ కావాలనే వరుణ్ ను పక్కన పెట్టిందని ప్రచారం
దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత గాంధీ కుటుంబ దాయాదులు కలవనున్నారా? సంజయ్ గాంధీ, మేనకల కుమారుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలిస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. వరుణ్‌ గాంధీని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ తనదైన ప్రయత్నాలు చేసి విజయం సాధించారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్ చేరిక ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

ప్రస్తుతం వరుణ్‌ ఉత్తరప్రదేశ్‌ లోని సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్ విషయంలో ఆయన తల్లి, కేంద్ర మంత్రిగా ఉన్న మేనకా గాంధీ నిర్ణయమే కీలకమని తెలుస్తోంది. ఆయన్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నా, కావాలనే బీజేపీ పక్కన బెట్టిందని, ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు తెలుస్తోంది.

యూపీ ఎన్నికల్లో విజయం అనంతరం వరుణ్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు రాగా, చివరికి అనూహ్యంగా యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్ కాంగ్రెస్ లో చేరితే రాహుల్ తో కలసి కాంగ్రెస్ ను ముందుకు నడిపిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ కేబినేట్‌లో మేనకా గాంధీ ఉన్న కారణంగా, ఆయన ఎంతవరకూ కాంగ్రెస్ లో చేరుతారన్న విషయంపై మాత్రం కొంత సందిగ్ధత నెలకొనివుంది.
varun gandhi
priyanka gandhi
Congress

More Telugu News