వర్మ: ఎన్టీఆర్ పై సినిమా అలా తీస్తానని నేనేమైనా మీ చెవుల్లో చెప్పానా?: వర్మ ఆగ్రహం
- ఇప్పుడున్న సూపర్‌స్టార్లందరి కన్నా ఎన్టీఆర్ స్పెషల్
- ఎన్టీఆర్ గురించి తప్పుగా సినిమా తీస్తానని నేనెప్పుడైనా చెప్పానా?
- మరెందుకు అలా విమర్శిస్తున్నారు?
- నేనేమైనా ఈ సినిమా కథ గురించి చెప్పానా?
ఎన్టీఆర్ గురించి చెడుగా సినిమా తీస్తే ఊరుకోబోమని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ను దేవుడిగా భావించే తాను ఆయన గురించి తప్పుగా సినిమా తీస్తానని ఎప్పుడైనా ఎవరి చెవిలోనైనా చెప్పానా? అని ప్రశ్నించారు. అసలు ఎన్టీఆర్ గురించి సినిమా బాగా తీయకపోతే జనం ఊరుకోరని అన్నారు. తాను ఎటువంటి కథతో ఈ సినిమా తీస్తున్నానో వారికి తెలుసా? అని ప్రశ్నించారు.
ఎవరు ఏ సినిమా తీసినా, ఎంతో ఖర్చు చేసి తీస్తారని, ఓ దర్శకుడిగా సినిమాలో పలు విషయాలు చూపడం తన బాధ్యతని వర్మ అన్నారు. వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులు ఆ సినిమా చూడాలని దర్శకులు అనుకుంటానని అన్నారు. మహానుభావుడైన ఎన్టీఆర్ గురించి ఎన్ని సినిమాలైనా రావచ్చని తెలిపారు. హిట్లర్ మీద 37 సినిమాలు వచ్చాయని, అవన్నీ ఆయన జీవితంలో జరిగిన వేర్వేరు ఘటనల ఆధారంగా తీశారని అన్నారు. ఎన్టీఆర్‌పై తాను కాకుండా మరికొంత మంది సినిమా తీసినా తాను ఆహ్వానిస్తానని రామాయణాన్ని ఎంతో మంది తీశారని, అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఎంతమంది ఎన్ని కోణాల్లోనయినా తీసుకోవచ్చని అన్నారు. ఇప్పుడున్న సూపర్‌స్టార్లందరి కన్నా ఎన్టీఆర్ స్పెషల్ అని అన్నారు. ఇప్పటికి కూడా ఆయన ఇమేజ్ అలాగే ఉందని చెప్పారు.