రఘువీరారెడ్డి: చంద్రబాబు, జగన్ రాష్ట్ర ద్రోహులు: రఘువీరారెడ్డి
- టీడీపీ, వైసీపీ కేంద్ర సర్కారుకి దాసోహం అయిపోయాయి
- చంద్రబాబు, జగన్‌లకి ఖలేజా లేదు
- వారిని ప్రజలు నిలదీయాలి
- రాష్ట్రానికి లోటు బడ్జెట్టు 12 వేల కోట్ల రూపాయలు రావాలి
టీడీపీ, వైసీపీ రెండూ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, ప్రధాని మోదీకి దాసోహం అయిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ రోజు విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు, జగన్‌లకి ఖలేజా లేదు కాబట్టే రాష్ట్ర ప్రయోజనాలను మోదీకి తాకట్టుపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు, జగన్ రాష్ట్ర ద్రోహులని రఘువీరారెడ్డి అన్నారు.
ఇంటింటికీ టీడీపీ అని ఒక పార్టీ, వైఎస్సార్ కుటుంబం అని మరో పార్టీ నేతలు ప్రజల ఇళ్లకు వస్తున్నారని, వారిని ప్రజలు నిలదీయాలని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రత్యేక రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం, ప్రత్యేక ప్యాకేజీ లేక ప్రత్యేక హోదా అమలు గురించి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి లోటు బడ్జెట్టు 12 వేల కోట్ల రూపాయలు రావాలని, అవి ఇంకా రాలేదని ఆయన విమర్శించారు.