వెంకయ్య. చంద్రబాబు: చంద్రబాబు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పని చేయాలి: వెంకయ్య నాయుడు
- తెలుగు భాషను తప్పనిసరి చేయాలి
- తెలుగులో చదువుకుంటే ఎదగలేమేమోనని అపోహలు పెట్టుకోకూడదు
- మాతృ భాష సొంత కళ్లు లాంటిది
- ఏపీలో ఉద్యోగం రావాలంటే తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలనే నిబంధన పెట్టాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఈ రోజు ఏపీలో జాతీయ రహదారులు, జల రవాణా ప్రాజెక్టులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు, తాను ఇంగ్లిష్ మీడియంలో చదువుకోలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకోలేదని అన్నారు.
తెలుగులో చదువుకుంటే ఎదగలేమేమోనని అపోహలు పెట్టుకోకూడదని చెప్పారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదని అన్నారు. మాతృ భాష సొంత కళ్లు లాంటిదని, పర భాష కళ్లద్దాల వంటిదని చెప్పారు. కళ్లు ఉంటేనే కళ్లద్దాలు ఉపయోగపడుతాయని అన్నారు. పరభాష వ్యామోహం ఎక్కువయిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం రావాలంటే తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలనే నిబంధన పెట్టండని చంద్రబాబుని కోరారు. అప్పుడే పర భాష వ్యామోహం తగ్గుతుందని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంతమంచిదని, మాతృభాషను మాత్రం మర్చిపోవద్దని చెప్పారు.
కాగా, దేశవ్యాప్తంగా నదులు ఇంకిపోతున్నాయని, నదుల అనుసంధానం చాలా అవసరమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదేనని ప్రశంసించారు. నదులు అనుసంధానమైతే నీటి సమస్య తీరుతుందని చెప్పారు. పోలవరం నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే తాను సందర్శించాలని భావిస్తున్నట్లు తెలిపారు.